Uttam Kumar Reddy: సంక్రాంతి తర్వాత అర్హులకు కొత్త తెల్ల రేషన్ కార్డులు..! 2 d ago
TG : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారు, కొత్తగా పెండ్లి చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఎంతో ఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగనే రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ ఘటనతో.. రేషన్ కార్డుల మంజూరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.
సంక్రాంతి తర్వాత తెలంగాణలో అర్హులకు కొత్త తెల్ల రేషన్‌కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులతోపాటు పేదలకు దొడ్డు బియ్యం బదులుగా సన్నబియ్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థను రద్దు చేసి, లబ్ధిదారులకు సరాసరి డబ్బు చెల్లించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే యోచన ప్రస్తుతానికి లేదన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.